బొద్దింకల సమర భేరి: కాక్రోచ్ జనతా పార్టీ - యువతరం ఆశల నినాదం

పేరు వింటేనే ఏవగింపు, చూసినంతనే అసహ్యంతో ఒంటిని జలదరింపజేసే బొద్దింకలు కొన్ని రోజులుగా పత్రికల పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయి. ‘సమాజంలోని కొంతమంది బొద్దింకల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారు. ఉద్యోగాలు లేని యువత సామాజిక మాధ్యమాలు, ఆర్‌టిఐ కార్యకర్తలుగా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారు’ అంటూ కొన్ని రోజుల క్రితం ఒక కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావానికి బాటలు వేశాయి. తన మాటలు యువతను ఉద్దేశించి కావని న్యాయమూర్తి వివరణ ఇచ్చినా అప్పటికే ఈ వ్యాఖ్యలపై యువతలో మిన్నంటిన ఆగ్రహావేశాలు సామాజిక మాధ్యమాల్లో ప్రతిఫలించాయి.

ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పేరును అనుకరిస్తూ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తమను ఏ కీటకంతో పోల్చారో అదే కీటకం పేరిట వ్యంగ్యాత్మకంగా రూపొందించిన కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఇప్పుడు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది.

ప్రస్తుతానికి సామాజిక మాధ్యమాలకే పరిమితమైన ఈ పార్టీ కళ్లు తెరిచి పట్టుమని పదిరోజులైనా కాకముందే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రెండు కోట్ల మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నదంటే ఆశ్చర్యమే. అధికార భారతీయ జనతా పార్టీకి సామాజిక మాధ్యమాల్లో గల ఆదరణ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఆదరణను సిజెపి నాలుగైదు రోజుల్లోనే సొంతం చేసుకుంది. కొన్నేళ్లపాటు శ్రమిస్తేనేగాని ఒక రాజకీయ పార్టీ ప్రజాభిమానాన్ని చూరగొని నిలదొక్కుకోవడం కష్టసాధ్యమైన పరిస్థితుల్లో కళ్లు తెరిచీ తెరవకముందే ఇంతటి ఆదరణను కైవసం చేసుకోవడం ఒక అద్భుతం.

మరొక విధంగా చెప్పాలంటే, యువతరంలో పెల్లుబుకుతున్న నిరాశా నిస్పృహలకు ఈ పరిణామాన్ని తార్కాణంగా చెప్పుకోవచ్చు. సామాజిక మాధ్యమాలను ఆసరా చేసుకుని యువతరం దేశ రాజకీయ స్థితిగతుల్నే సమూలంగా మార్చివేస్తున్న సంఘటనలు కొత్తేమీ కాదు.

సామాజిక మాధ్యమాలను నిషేధించినందుకే యువతరం ఒక్కటై నేపాల్ లో ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన సంఘటన మన కళ్లముందు కదలాడుతూనే ఉంది. బంగ్లాదేశ్ లోనూ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడంలో యువతే కీలకపాత్ర పోషించిందన్న సంగతీ తెలిసిందే.