వన్‌ప్లస్ N6: విడుదల తేదీ ఖరారు, ధర, ఫీచర్లు..?

వన్‌ప్లస్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ N6ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ మోడల్ విడుదల తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. వన్ ప్లస్ N6 జూన్ 30న మధ్యాహ్నం 12 గంటలకు టెక్ మార్కెట్లో విడుదల కానుందని వన్ ప్లస్ తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో సమాచారం పంచుకుంది. ఈ మోడల్ కంపెనీ N-సిరీస్‌లో మొదటిది కానుంది. తక్కువ ధరకే వన్‌ప్లస్ అనుభవాన్ని కోరుకునే వినియోగదారుల కోసం ఈ సిరీస్‌ను ప్రారంభిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది.

డిజైన్

టీజర్ ఇమేజ్ ప్రకారం, వన్‌ప్లస్ N6 ఫ్లాట్ రియర్ ప్యానెల్, ఫ్లాట్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. వెనుక ప్యానెల్ కుడి వైపు పైభాగంలో చతురస్రాకార కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇందులో రెండు కెమెరా సెన్సార్లు, ఒక LED ఫ్లాష్ ఉంటాయి. వన్‌ప్లస్ బ్రాండింగ్ మధ్యలో ఉండగా పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ కుడి వైపున ఉంటాయి. అయితే ఎడమ వైపున ఎటువంటి బటన్లు లేవు. USB టైప్-సి పోర్ట్, స్పీకర్ గ్రిల్, సిమ్ ట్రే కింద భాగంలో ఉంటాయి, అలాగే పైభాగంలో సెకండరీ మైక్రోఫోన్ ఉంటుంది. కాగా, కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను బ్లాక్, గ్రీన్ రంగులలో విడుదల చేయనుంది.

ధర

భారతదేశంలో కొత్త N-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ధర రూ.18,000 నుండి రూ.25,000 మధ్య ఉంటుందని వన్‌ప్లస్ వెల్లడించింది. అంటే, ఈ స్మార్ట్‌ఫోన్‌లు కంపెనీ నార్డ్ సిరీస్ కంటే తక్కువ ధరకే లభిస్తాయి. ఇక కొన్ని N-సిరీస్ మోడళ్ల ధర రూ.20,000 కంటే తక్కువగా ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. దీనితో ఇది వన్‌ప్లస్ కొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌గా నిలుస్తుంది.

అందుబాటు

వన్‌ప్లస్ N6 భారత్ లో అమెజాన్ ద్వారా విక్రయానికి రానుంది. ఇప్పటికే కంపెనీ తన మైక్రోసైట్‌ను కూడా లైవ్‌లోకి తెచ్చింది. లాంచ్‌కు ముందు ఫోన్‌ను నిరంతరం టీజ్ చేస్తోంది. అయితే, స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్, కెమెరా స్పెసిఫికేషన్లు, బ్యాటరీ, ఛార్జింగ్‌కు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. స్పెసిఫికేషన్లు, ధర గురించి పూర్తిగా తెలియాలంటే ఈ పరికరం లాంచ్‌ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.