ఆమె ‘కామ్రేడ్’ అని పిలిచిన రాత్రి
ఆమె ‘కామ్రేడ్’ అని పిలిచిన రాత్రి: ఒక ప్రేమ మరియు రాజకీయ కథ
ఆమె రాజకీయ సభలకు హాజరైన రాత్రి
ఆమెకు రాజకీయ సభలంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. జనం గుంపులు, నినాదాలు, స్టేజ్ మీద పొడవాటి ప్రసంగాలు… ఇవన్నీ తన ప్రపంచానికి దూరమని అనుకునేది. ఒకసారి నవ్వుతూ చెప్పింది కూడా.. ”మీ మీటింగ్స్‌లో అందరూ కోపంగానే ఎందుకు మాట్లాడతారు రామ్?” ”ఎందుకంటే బయట ప్రపంచం అంత సంతోషంగా లేదు కాబట్టి” అన్నాను. ఆమె నవ్వేసింది. కానీ ఆ సమాధానం ఆమెలో ఎక్కడో నిశ్శబ్దంగా మిగిలిపోయింది.
రాజకీయ సమావేశం మరియు కామ్రేడ్
ఆ రోజు జిల్లా కేంద్రంలో రైతుల సమస్యలపై భారీ బహిరంగ సభ. మధ్యాహ్నం నుంచే హడావిడి. ఫోన్లు, ఏర్పాట్లు, పరుగులు. అప్పుడే ఆమె మెసేజ్ వచ్చింది…
”ఈరోజు నీ మీటింగ్‌కి వస్తాను.”
నేను ఆశ్చర్యపోయాను.
”బోర్ కొడుతుంది” అన్నాను.
”నువ్వుంటావు కదా…” అని రిప్లై.
సభాస్థలిలో జన సముద్రం
సాయంత్రానికి సభాస్థలి జనంతో నిండిపోయింది. ఎర్రజెండాలు గాలిలో రెపరెపలాడుతున్నాయి. ధూళి, చెమట, టీ ఆవిరి, నినాదాల వేడి.. అక్కడ ఒక జీవవంతమైన అగ్ని… నేను స్టేజ్ వెనుక నిలబడి నోట్స్ చూస్తున్నాను. అప్పుడే జనంలో ఆమె కనిపించింది. తెల్లటి కాటన్ డ్రెస్. వదులుగా జారిన జుట్టు. హడావిడి మధ్యలో కూడా ఒక అసాధారణ నిశ్శబ్దం. ఆమె కళ్లతో నన్నే వెతుకుతోంది. మా చూపులు కలిశాయి. ఆమె నవ్వింది.
ప్రసంగం మరియు ఆమె చూపు
”కామ్రేడ్స్…”
ఆ పదం గాల్లో పగిలిన క్షణంలో నా లోపల ఏదో మేల్కొంది. కొన్ని విషయాలు మనిషి నేర్చుకోడు. అవి అతని రక్తంలోనే ఉంటాయి. నా పేరు పిలిచారు. నేను స్టేజ్ పైకి వెళ్లాను. వేలాది ముఖాలు. కొన్ని అలసినవి. కొన్ని కోపంతో మరిగినవి. కొన్ని ఇంకా ఆశను పట్టుకున్నవి. మైక్ ముందు నిలబడగానే ఎందుకో నా చూపు మళ్లీ ఆమె దగ్గరే ఆగిపోయింది.
ఆమె చూపులో ప్రేమ మరియు గౌరవం
ఆమె చాలా శ్రద్ధగా చూస్తోంది. నేను మొదట నెమ్మదిగా మాట్లాడాను. తర్వాత మాటలు లోపల దాచుకున్న అగ్నిలా మారాయి.
”ఈ దేశంలో అన్నం పండించే రైతుకే భూమి మీద హక్కు లేకపోతే… అది అన్యాయం కాదు, వ్యవస్థ వైఫల్యం…” చప్పట్లు.
”రోజంతా చెమటోడ్చిన మనిషి రాత్రికి ఆకలితో పడుకుంటే… ఆ అభివద్ధి ఎవరి కోసం?”…
ఆమె చేతిని పట్టుకోవడం
ప్రసంగం ముగిసింది. స్టేజ్ దిగాను. కానీ మనసు మాత్రం ఆమె వైపుకే పరుగెత్తుతోంది. ఆమె కొద్దిదూరంలో నిలబడి ఉంది. నేను దగ్గరకి వెళ్లాను. కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. కేవలం నన్నే చూస్తోంది.
”ఏమైంది?” అన్నాను.
ఆమె మెల్లగా తల ఊపుతూ.. ”ఏమీ లేదు..”
”అయితే అలా ఎందుకు చూస్తున్నావు?”..
ఆమె నవ్వింది.
”నువ్వు స్టేజ్ మీద ఉన్నప్పుడు… నాకు భయం వేసింది.”
”ఎందుకు?”
ఆమె కాస్త ఆగింది.
ఒంటరితనం మరియు ప్రేమ
”అంతమందిలో కూడా నువ్వు చాలా ఒంటరిగా కనిపించావు రామ్…” ఆ మాట… నా లోపల ఎక్కడో లోతుగా పడిపోయింది. ఎందుకంటే అది నిజం. ప్రజల కోసం మాట్లాడే మనుషుల లోపల ఒక తెలియని ఒంటరితనం ఉంటుంది.
రాజకీయ ప్రభావం మరియు ప్రేమ
ఆమె ఒక్కసారిగా నా చేతిని పట్టుకుంది. ఆ స్పర్శలో ఒక మదుత్వం.
”రామ్…” అంది.
”నీ మీద ఇప్పుడు ఇంకాస్త ప్రేమ పెరిగింది.”
నేను నవ్వాను.
”రాజకీయ ప్రభావమా?”
ఆమె తల ఊపింది.
”లేదు…”
ప్రేమ మరియు దూరం
కొద్దిసేపు ఆగి అంది… ”ఇంతమందిని గురించి నిజంగా బాధపడగలిగే మనిషిని ప్రేమించడం… కొంచెం ప్రమాదకరమే అనిపిస్తోంది.”
”ఎందుకు?”
ఆమె నా భుజానికి దగ్గరైంది.
”ఎందుకంటే… అలాంటి మనుషులు పూర్తిగా ఒక్కరి సొంతం కాలేరు.”
ఆ మాట తర్వాత మధ్యలో ఒక నిశ్శబ్దం పుట్టింది. ఆ నిశ్శబ్దంలోనే నేను మొదటిసారి అర్థం చేసుకున్నాను.. ప్రేమ అంటే ఎవరినో దగ్గరగా ఉంచుకోవడం మాత్రమే కాదు. వాళ్ల దూరాన్ని కూడా అంగీకరించడం.
ఆ రాత్రి గాలి చాలా మదువుగా ఉంది. వీధిదీపాల వెలుతురులో ఆమె ముఖం చూస్తుంటే ప్రేమ, పోరాటం రెండూ వేర్వేరు కాదని అనిపించింది. కొందరు మనుషులు మన చేతిని మాత్రమే కాదు… మన ఆశయాలను కూడా పట్టుకుంటారు. ఆమె అలాంటిదే. వెళ్లే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగింది. చిన్నగా నవ్వుతూ అంది…
