అద్భుతం సృష్టించిన ఆశిశ్.. జావెలిన్ త్రోలో పతకం

ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్స్: జావెలిన్ త్రోలో భారత్‌కు రజత పతకం

భారత యువ అథ్లెట్ ఆశిశ్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన చేసి ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో రజత పతకం సాధించాడు. పదేళ్ల క్రితం ఇదే ఈవెంట్‌లో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం గెలిచిన తర్వాత ఇప్పుడు ఆశిశ్ పతకం సొంతం చేసుకుని రెండో భారత అథ్లెట్‌గా ఘనత సాధించాడు.

ఈ 19 ఏళ్ల యువ అథ్లెట్ గట్టి పోటీ ఉన్నా మెరుగైన ప్రదర్శన చేశాడు. దక్షిణాఫ్రికాకు చెందిన అథ్లెట్ జాన్ హెడ్రిక్ హైమన్స్ 80.50 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకం సాధించాడు. ఆశిశ్ 74.09 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. డొమినికాకు చెందిన అడ్జిసన్ జేమ్స్ (73.89 మీ) మూడో స్థానంలో కాంస్యం సొంతం చేసుకున్నాడు.

ఈ ఈవెంట్‌లో ఆరంభం నుంచి ఆశిశ్ గట్టి పోటీ ఎదురుకున్నాడు. మొదటి రౌండ్‌లో 69.96 మిటర్లు విసరిన అతడు మూడో త్రోలో 74.09 మీటర్లు విసిరి రజత పతకం సాధించాడు. ఓ అంతర్జాతీయ వేదికపై జూనియర్ లెవల్‌లో ఆశిశ్‌కు ఇదే తొలి పతకం కావడం గమనార్హం.

ఈ విజయంతో ఆశిశ్ భారత్‌లో జావెలిన్ త్రోలో భవిష్యత్తుకు ఆశాజనకంగా నిలిచాడు. అతడి ఈ ప్రదర్శన భారత అథ్లెటిక్స్‌కు కొత్త ఆశలను పెంచింది. ఇటువంటి ప్రదర్శనలతో భారత్ తదుపరి పోటీల్లో మరింత విజయాలను సాధించగలదని ఆశించవచ్చు.