US మేయర్ ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. న్యూయార్క్ సిటీ, సిన్సినాటి, అట్లాంటా, పిట్స్‌బర్గ్‌లలో మేయర్ స్థానాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
న్యూయార్క్ నగర మేయర్ స్థానంలో భారతీయ మూలాలున్న డెమోక్రటిక్ పార్టీకి చెందిన జొహ్రాన్ మమ్దానీ విజయం సాధించగా, భారత సంతతికి చెందిన వ్యక్తి అప్తాబ్ పురేవాల్ సిన్సినాటి మేయర్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తమ్ముడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కోరీబౌమన్‌ను ఓడించి విజయకేతనం ఎగురవేశారు.
పురేవాల్ రెండవ సారి మేయర్‌గా ఎన్నికయ్యారు. తొలిసారి 2021లో మేయర్‌గా ఎన్నికయ్యారు. మే నెలలో జరిగిన ఆల్ పార్టీ మున్సిపల్ ప్రైమరీలో ఆయన 80శాతం కంటే ఎక్కువ ఓట్లతో గెలిచారు.
అప్తాబ్ పురేవాల్ ఎవరీ?
ఒహియోలో పంజాబీ తండ్రి, టిబెటన్ శరణార్థి తల్లికి జన్మించారు. వివాహం తర్వాత పురేవాల్ తల్లిదండ్రులు అమెరికాకు వలస వచ్చి ఒహియోలో స్థిరపడ్డారు. అక్కడే 1982లో ఆప్తాబ్ జన్మించారు. చిన్నప్పటి నుంచి అతను రాజకీయాలపై ఆసక్తి కలిగి ఉండేవారు.
“బిగ్, బ్రౌన్ మరియు బ్యూటిఫుల్” నినాదంతో 8వ తరగతిలో తన మొట్టమొదటి విద్యార్థి ఎన్నికల్లో గెలిచాడు. సిన్సినాటీ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లా నుంచి పట్టా పొందిన తర్వాత.. 2008లో వాషింగ్టన్ డీసీకి వెళ్లారు. అక్కడ ఒక లా ఫర్మ్‌లో పనిచేశారు.
నాలుగు సంవత్సరాల తర్వాత అతను న్యాయ శాఖలో ప్రత్యేక అసిస్టెంట్ యూఎస్ అటార్నీగా పనిచేయడానికి ఒహియోలోని హోమిల్టన్ కౌంటీకి తిరిగి వచ్చారు.
2013లో ఒహియోకు చెందిన కన్స్యూమర్ గూడ్స్ దిగ్గజం ప్రాక్టర్ అండ్ గాంబుల్‌లో లీగల్ కౌన్సిల్‌గా చేశారు. అక్కడ ఆయన ప్రముఖ స్కిన్‌కేర్ బ్రాండ్ ఓలేకు గ్లోబల్ బ్రాండ్ అటార్నీగా పనిచేశారు.
మూడు సంవత్సరాల తర్వాత ఆయన తన ఉద్యోగాన్ని వదిలేసి.. రాజకీయ జీవితాన్ని అధికారికంగా ప్రారంభించారు.