ఆర్‌సీబీకి బిగ్ షాక్: పూజా వస్త్రాకర్ మరో రెండు వారాల పాటు ఆటకు దూరం

మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం నవీ ముంబై వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఖరి బంతికి లక్ష్యాన్ని అందుకుని విజయం సాధించింది. కానీ, ఈ విజయం తరువాత ఆర్‌సీబీకి బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ మరో రెండు వారాల పాటు ఆటకు దూరం కానుంది.

పూజా వస్త్రాకర్ గాయం

26 ఏళ్ల పూజా వస్త్రాకర్ చివరిగా టీ20 ప్రపంచకప్ 2024లో ఆడింది. అయితే, భుజం గాయం కారణంగా ఆమె ఆ తరువాత ఆటకు దూరంగా ఉంది. డబ్ల్యూపీఎల్ వేలంలో ఆర్‌సీబీ ఈ పేస్ ఆల్‌రౌండర్‌ను రూ.85లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ సమయానికి ఆమె కోలుకుంటుందని భావించింది. అయితే, ఇప్పుడు ఆమె తొడ కండరాల గాయంతో బాధపడుతోంది.

రెండు వారాల పాటు విశ్రాంతి

ఆర్‌సీబీ హెడ్ కోచ్ మలోలన్ రంగరాజన్ మాట్లాడుతూ, పూజా వస్త్రాకర్ గాయం గురించి వివరించారు. భుజం గాయం కారణంగా పూజా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసంలో ఉందని చెప్పారు. ఈ గాయం నుంచి కోలుకున్నప్పటికీ, తొడ కండరాల గాయం కారణంగా మరికొన్నాళ్ల పాటు ఆమెకు విశ్రాంతి అవసరమని తెలిపారు. ఈ గాయం నుంచి కోలుకునేందుకు మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉందని, అయితే, ఆమె ఖచ్చితంగా ఏ తేదీన మ్యాచ్ ఆడుతుందో చెప్పడం కష్టమని మలోలన్ రంగరాజన్ వెల్లడించారు.

డబ్ల్యూపీఎల్ 2026

డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ శుక్రవారం ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆ తరువాత నదైన్ డిక్లెర్క్ (44 బంతుల్లో 63 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో 155 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ సరిగ్గా 20 ఓవర్లలో అందుకుంది.

ఆర్‌సీబీకి బిగ్ షాక్

డబ్ల్యూపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో విజయం సాధించి మంచి జోష్‌లో ఉన్న ఆర్‌సీబీకి పూజా వస్త్రాకర్ గాయం బిగ్ షాక్ తగిలింది. ఆమె దూరంగా ఉండటంతో ఆర్‌సీబీ జట్టుకు బలం తగ్గింది.