రక్షక భటులా.. రాక్షసులా?

రక్షక భటులా.. రాక్షసులా?

లాకప్ గదుల గోడలకే గనుక కళ్లుండి ఉంటే, నిందితులపట్ల కొందరు పోలీసులు ఎంతటి అమానుషంగా ప్రవర్తిస్తారో చూసి కంటనీరు పెట్టేవి. వాటికే గనుక శ్రవణశక్తి ఉంటే పోలీసుల చిత్రహింసలకు నిందితులు చేసే ఆర్తనాదాలు వినలేక చెవులు మూసుకుని ఉండేవి. నేరాభియోగంపై, కొండకచొ నిరపరాధులను సైతం నిర్బంధించి, విచారణ పేరిట హింసించి, పైశాచిక ఆనందం పొందే పోలీసుల సంఖ్య మన సమాజంలో తక్కువేమీ కాదు. ఇలాంటివారి వల్ల వృత్తికి అంకితమై, చట్టానికి బద్ధులై పనిచేసే పోలీసులు తలదించుకోవలసి వస్తోంది.

ఓ లాకప్ డెత్ కేసుకు సంబంధించి మదురై అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు తాజాగా వెలువరించిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

కోవిడ్ సమయంలో నిబంధనలను ఉల్లంఘించి దుకాణం తెరిచారన్న అభియోగంపై తండ్రీకొడుకులను అరెస్ట్ చేసిన సాత్తాంకుళం పోలీసులు వారిద్దరినీ వేధించి, వారి చావుకు కారణమైన వైనం ఎంతటి పాషాణ హృదయులనైనా కరిగించకమానదు. ఈ ఘటనకు కారణమైన తొమ్మిదిమంది పోలీసులకు ఉరిశిక్ష విధించడం ద్వారా మదురై కోర్టు చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది.

హింసించి చంపడమే కాదు, తమ అమానుష కాండను మసిపూసి మారేడుకాయ చేసి, సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించిన తీరును గమనించి న్యాయమూర్తే ఆశ్చర్యపోయారంటే సదరు పోలీసులు ఎంతటి ఆరితేరిన బంట్లో అర్థం చేసుకోవచ్చు.

రాత్రంతా స్టేషన్‌లో నిర్బంధించి, బట్టలూడదీసి, పైశాచికంగా దాడి చేశారనీ, లాకప్ గోడలకు అంటిన రక్తపు మరకలను నెత్తురోడుతున్న బాధితులతోనే కడిగించారని సదరు పోలీసుల అకృత్యాలను సిబిఐ తన 1500 పేజీల చార్జిషీట్ లో సవివరంగా కళ్లకు కట్టింది.

దీనిని అరుదైన కేసులలో అత్యంత అరుదైనదిగా పేర్కొన్న న్యాయమూర్తి, యావజ్జీవ కారాగార శిక్షతో సరిపెడితే ఇలాంటి నేరగాళ్లకు భయం లేకుండా పోతుందని పేర్కొనడం ముమ్మాటికీ సత్యం.

లాకప్ డెత్ అనే మాట నేటి సమాజంలో సర్వసాధారణమైపోయింది. దేశంలో ఎక్కడో ఒక చోట తరచూ లాకప్ మరణాలు సంభవిస్తూనే ఉన్నా, శిక్ష పడుతున్న దృష్టాంతాలు చాలా తక్కువ.