ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జో రూట్ టెస్టుల్లో శతకాల మోత మోగిస్తున్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. టెస్టుల్లో అతడికి ఇది 41వ సెంచరీ. అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లలో) 60వ సెంచరీ కావడం గమనార్హం.
తాజా శతకంతో రూట్ టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉండగా దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు జాక్వెస్ కలిస్ రెండో స్థానంలో ఉన్నాడు.
టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..
- సచిన్ టెండూల్కర్ (భారత్) – 51 సెంచరీలు
- జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 45 సెంచరీలు
- రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 41 సెంచరీలు
- జోరూట్ (ఇంగ్లాండ్) – 41* సెంచరీలు
- కుమార సంగక్కర (శ్రీలంక) – 38 సెంచరీలు
- స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) – 36 సెంచరీలు
- రాహుల్ ద్రవిడ్ (భారత్) – 36 సెంచరీలు
ఇక ఈ మ్యాచ్‌లో రూట్ 242 బంతులు ఎదుర్కొన్నాడు. 15 ఫోర్ల సాయంతో 160 పరుగులు సాధించాడు. రూట్ భారీ శతకంతో రాణించడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లీష్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ (84) హాఫ్ సెంచరీ చేశాడు. జేమీ స్మిత్ (46) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో మైఖేల్ నెసర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. స్కాట్ బొలాండ్, మిచెల్ స్టార్క్ చెరో రెండు వికెట్లు తీశారు. కామెరూన్ గ్రీన్ ఓ వికెట్ సాధించాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 34.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.