ఐపీఎల్ 2026 మినీ వేలంలో న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్‌ను జట్టులోకి తీసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ ను భారత మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కోరారు. ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై మంగళవారం (డిసెంబర్ 16న) అబుదాబిలో జరిగే వేలంలో రూ.43.40 కోట్ల పర్స్ వాల్యూతో పాల్గొననుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ (రూ.64.30 కోట్లు) తరువాత రెండో అతి పెద్ద పర్స్ వాల్యూ సీఎస్‌కే వద్ద ఉంది.
తన యూట్యూబ్ ఛానెల్‌లో శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) మాట్లాడుతూ.. బ్రేస్‌వెల్ ఆల్ రౌండ్ నైపుణ్యాలను హైలైట్ చేశాడు. 34 ఏళ్ల అతడు చెన్నై మిడిల్ ఆర్డర్‌కు మంచి సమతుల్యతను తీసుకువస్తాడని చెప్పుకొచ్చాడు.
‘‘సీఎస్‌కే జట్టులో తొలి నాలుగు స్థానాల్లో రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్ వంటి హిట్టర్లు ఉన్నారు. దీంతో వారు బ్యాటింగ్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. నేను సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌లో ఉంటే మైఖేల్ బ్రేస్‌వెల్ లాంటి వ్యక్తిని ఎంచుకుంటాను. అందరూ అతనిని తక్కువ అంచనా వేస్తున్నారు. అతను హైదరాబాద్‌లో భారత్‌పై అద్భుతమైన సెంచరీ సాధించాడు. అతను మంచి ఆఫ్-స్పిన్ బౌలింగ్ చేయగలడు. అంతేకాదు.. బంతిని హిట్టింగ్ చేయగల ఎడమ చేతి వాటం ఆడగాడు. ఓ మంచి ఫినిషర్.’’ అని శ్రీకాంత్ అన్నారు.
‘‘వాస్తవం చెప్పాలంటే మైఖేల్ బ్రేస్‌వెల్ గురించి చాలా మంది మాట్లాడటం లేదు. అందరూ లివింగ్‌స్టోన్ అని అంటున్నారు. బ్రేస్‌వెల్‌ను ప్రోత్సహిస్తే, అతను బాగా రాణిస్తాడు. ధోని లాంటి వ్యక్తి అతన్ని అద్భుతమైన ఆల్ రౌండర్‌గా తీర్చిదిద్దగలడు.’’ అని శ్రీకాంత్ తెలిపాడు.
బ్రేస్‌వెల్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఒకే ఒక సీజన్ ఆడాడు. 2023లో అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. ఐదు మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో 58 పరుగులు చేశాడు.